ratan-tata-telugu

బి.ఆర్.అంబేద్కర్ పూర్తి జీవిత చరిత్ర - B.R Ambedkar Biography in Telugu

కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, గుళ్ళోకి వెళ్తే తప్పు, ముట్టుకుంటే తప్పు చివరికి నీళ్లు తాగినా తప్పే ... ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. అలాంటి సమయంలో అట్టడుగు వర్గాల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మూగ బోయిన అణగారిన ప్రజలకు గొంతుకయ్యాడు. అతనే (B. R. Ambedkar) బి.ఆర్.అంబేద్కర్ గారు.

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, మహా మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.

చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏంటి? దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు? ముట్టుకోవడానికి కూడా వీలు లేదన్న వ్యక్తి... దేవుడిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగారు? ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.

1891 వ సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీన రాంజీ మాలోజి సక్పాల్ (Ramji Maloji Sakpal) మరియు భీమాబాయ్ (Bhimabai) అనే ఇద్దరి దంపతులకు మధ్య ప్రదేశ్ లోని మావ్ గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు. అప్పట్లో ఈ కులం వారిని అంటరానివారి గా పరిగణించేవారు. 14 మంది సంతానంలో ఈయన చివరివాడు. ఈయన పూర్తి పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్ (Bhimrao Ramji Ambedkar). ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీ లో సుభేదార్ గా పని చేసేవారు.

అంబేద్కర్ గారికి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో పదవీ విరమణ పొందడంతో కుటుంబమంతా ముంబై కి వెళ్లిపోయారు. అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగం లో చేరారు. ఆదాయం తగ్గడంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి.అంబేద్కర్ గారికి ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు. అప్పటికి 14 మందిలో ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు మాత్రమే మిగిలిగారు. మిగిలిన వారంతా చనిపోయారు.

దళితుడు అనే కారణంతో ఈయన చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరుకి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందిన వారు అని తెలిసి నీళ్లు ఇవ్వకపోగా, పక్కనే ఉన్న మురికి గుంటలో నీటిని తాగమని తిట్టి పంపించారు.

ఇక తప్పక దాహంతోనే కొంత దూరం నడిచి వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనిపించింది. అది ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఆ బండివాడికి ఈయన మహర్ కులానికి చెందినవాడని తెలిసి వాళ్ళని తిట్టి బండి నుండి దింపేసాడు. చివరికి వాళ్ళు రెండింతల బాడుగ ఇస్తానని బ్రతిమలాడితే అప్పటికే ఆ బండి మైల పడిపోయిందని చెప్పి వాళ్ళని ఆ బండి మీద వెళ్ళమని ఆ బండి వాడు దూరంగా నడిచి వచ్చాడు.

చివరికి స్కూల్ లో కూడా మిగిలిన పిల్లలు అందరూ లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం తరగతి గది బయట తలుపు దగ్గర కూర్చునేవారు. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు బోర్డ్ మీద ఒక లెక్క ఇచ్చి చెయ్యమంటే ఎవరు చేయలేకపోయారు. కానీ అంబేద్కర్ గారు చేయడానికి బోర్డు దగ్గరకు వెళ్తుంటే ఆ బోర్డ్ దగ్గరలో తమ భోజనాల క్యారేజ్ లు ఉన్నాయని అవి మైల పడతాయని అంబేద్కర్ బ్లాక్ బోర్డు ని ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు.

చివరికి దాహం వేస్తే కుండలోని మంచి నీళ్లుకూడా తాగడానికి అనుమతి ఉండేది కాదు. అగ్రకులానికి చెందినవారు ఎవరైనా వచ్చి గ్లాస్ తో పై నుండి నీటిని పోస్తే వాటిని దోసిళ్ళతో పట్టుకుని తాగవలసి వచ్చేది. ఎక్కువగా ఆ స్కూల్ ప్యూన్ నీటిని పోసేవాడు. ఒకవేళ ఆ ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్లు ఉండేవికాదు. అలా కొన్ని రోజులు అయితే ఒక్క చుక్క నీటిని కూడా తాగకుండా ఇంటికి వెళ్లిపోయేవారు.

ఆ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయన వివక్షతకు గురయ్యేవారు. అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందు ఉండేవారు. దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది. అప్పటివరకు అంబేద్కర్ గారి ఇంటిపేరు అంబవాడేకర్. కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో అంబవాడేకర్ అనే పేరును తీసేసి తన పేరైన అంబేద్కర్ గా మార్చారు. అప్పటి నుండి ఈయన పేరు బి.ఆర్.అంబేద్కర్ గా మారింది.

అలా 1907 లో Elphinstone High School లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసారు. ఆ కాలంలో ఒక దళితుడు మెట్రిక్యులేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయమే. దాంతో ఈయనకు సన్మానం కూడా చేసారు. దానిలో భాగంగానే ఉన్నత చదువులు కోసం ఆయనకు ఆర్దికంగా సహాయం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు.

అయితే పై చదువులకు వెళ్ళడానికి ముందే అంబేద్కర్ గారికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, 9 ఏళ్ల వయసు ఉన్న రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేసేసారు. అప్పటికే బరోడా మహారాజ్ సాయాజీ రావు గైక్వాడ్ పేద విద్యార్థులకి ఆర్దికంగా సహాయం అందిస్తున్నారు అని తెలుసుకున్నారు. అలా బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకి 25 రూపాయల స్కాలర్షిప్ తో 1912 నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి Economics and political science డిగ్రీ పట్టా పొందారు.

తరువాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది. కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలని కోరిక మనసులో ఉండేది. దీని గురించి మహారాజ్ కి చెప్తే అయన దానికి ఒప్పుకుని ఒక షరతు పెట్టారు. అదేంటంటే విదేశాలలో చదువు పూర్తై ఇండియా కి వచ్చిన తరువాత బరోడా సంస్థానంలో 10 సంవత్సరాలు పని చేయాలని షరతు పెట్టారు. అంబేద్కర్ గారు దానికి ఒప్పుకుని బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకు పదకొండున్నర పౌండ్ల స్కాలర్షిప్ తో 1913 లో అమెరికా లోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు.

అమెరికాలో మొదటి సారిగా అంబేద్కర్ గారు స్వేచ్ఛ అంటే ఏంటో చూసారు. అప్పుడు భారత దేశంలో ఉన్నట్టుగా కుల, జాతి వివక్షత లేదు. అందరికి సమానమైన గౌరవం, అవకాశాలు దక్కేవి. అక్కడ కొలంబియా యూనివర్సిటీ లో పీజీ, Phd పూర్తి చేసారు. తరువాత 1916 లో లండన్ లోని London School of Economics లో చేరారు. అక్కడ 8 సంవత్సరాలలో పూర్తి చేయవలసిన చదువును కేవలం 2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తి చేసారు. అందుకోసం అంబేద్కర్ గారు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా లండన్ లైబ్రరీ లో ఉండే అన్ని పుస్తకాలను చదివారు.

అంబేద్కర్ గారు లండన్ లో ఉన్నప్పుడు ఎన్నో అంశాల మీద పుస్తకాలను కూడా రాసారు. అక్కడే ఆయనకు డాక్టరేట్ కూడా లభించింది. కానీ కొంతకాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్ షిప్ అయిపోయిందని, వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లో చేరమని ఉత్తరం అందింది. దాంతో 1917 లో అంబేద్కర్ వెనక్కి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగం లో చేరారు.

అక్కడ ఆయనకి ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దక్కింది కానీ ఈయన నిమ్న కులస్తుడు కావడంతో ఆయన కింద ఉండే ఉద్యోగులు కూడా ఆయనని గౌరవించేవారు కాదు. ఏదైనా ఒక ఫైల్ ఇవ్వాలంటే దూరం నుండే ఆయన టేబుల్ మీదకు విసిరేసేవారు. చివరికి ఆయన ఉండడానికి అద్దెకు కూడా ఎవరు ఇల్లు ఇచ్చేవారు కాదు. చేసేది లేక ఒక పార్సీ ల సత్రం లో ఉండేవారు. కొన్ని రోజులకి వాళ్ళకి కూడా ఈయన నిమ్న కులస్తుడు అని తెలిసి వాళ్ళు కూడా గెంటేశారు.

చదవాలన్న, పని చేయాలన్న, ఉండడానికి ఇల్లు కావాలన్నా, చివరికి నీళ్లు తాగాలన్న కూడా కులం అడ్డు వచ్చేది. మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే పడం కదా. అలాంటిది ఇలాంటి ఘోర అవమానాలు ఎదురైతే మనం తట్టుకోగలమా, కానీ ఆయన వాటన్నిటిని సహించారు.

చివరికి తన పరిస్థితిని బరోడా మహారాజ్ కి చెప్పుకుని, ఆయన ఏమి చెయ్యలేనని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి బొంబాయి వెళ్లిపోయారు. ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో ఆదాయం కోసం ట్యూషన్ లు చెప్పడం, కంపెనీలకు సలహా లను ఇచ్చే ఒక చిన్న consulting business కంపెనీ ని మొదలు పెట్టారు. మళ్ళీ కొన్ని రోజులకి అంబేద్కర్ గారు అంటరాని వాడని తెలిసి వ్యాపారులు కూడా ఆయన దగ్గరకు రావడం మానేశారు. దాంతో ఆ కంపెనీ ని మూసివేశారు.

ఈ కులం పేరుతో అసమానతలు ఆయన మనసును కదిలించాయి. ఇలాంటి పరిస్థితులలో చాలా మంది ఇక మన పరిస్థితి ఇంతే, మనం ఏం చెయ్యలేమని సరిపెట్టుకుంటారు. కానీ అంబేద్కర్ గారు అలా కాదు. అంటరానివాడని వెలేసిన సమాజానికి సమాధానం చెప్పాలనుకున్నారు.

చివరికి అప్పటి బొంబాయి గవర్నర్ సహాయంతో ఒక కాలేజీ లో ప్రొఫెసర్ గా ఉద్యోగం దక్కింది. అలా ఉద్యోగం చేసుకుంటూనే 1927 నుండి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలు పెట్టాడు. అలా మహద్ లో దళితుల మహా సభని ఏర్పాటు చేసారు. దేశంలో నలుమూలల నుండి కొన్ని వేళ మంది దళితులు ఆ సభకు హాజరయ్యారు. అప్పటివరకు దళితులు మహద్ లోని చెరువులో నీటిని తాగడానికి అనుమతి ఉండేది కాదు. కానీ అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువులో నీటిని తాగడానికి అనుమతి వచ్చేలా చేసారు. అనుమతి వచ్చిన సరే మొదటిగా ఆ చెరువులోకి వెళ్లి నీటిని తాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు ధైర్యంగా వెళ్లి చెరువులో నీటిని తాగారు. ఆ ఒక్క సభతో అంబేడ్కర్ గారి పేరు మారుమోగిపోయింది.

కొల్హపూర్ మహారాజ్ సాహు మహరాజ్ అస్పృశ్యత , అంటరానితనాన్ని నివారించడానికి కృషి చేస్తున్నారు అని తెలుసుకుని ఆయన సహకారంతో మూగ వాళ్ళకి నాయకుడు అనే అర్ధం వచ్చేలా "మూక్ నాయక్" అనే పత్రికను అలాగే బహిష్క్రుత్ భారత్, జనతా , ప్రబుద్ధ భారత్ అనే పత్రికలూ నడిపారు.

దళితులకు బడులలోకి, గుడులలోకి వెళ్ళడానికి అనుమతి పొందేలా ఉద్యమాలు చేపట్టి విజయం సాధించారు. ఆయన అంత స్థాయికి ఎదిగారు అంటే కారణం చదువు. కాబట్టే ఆయన అందరికి చదువు అందాలని కృషి చేసారు. కొన్ని రోజులకి ముంబై లోనే బారిష్టర్ గా పని చేయడం మొదలు పెట్టారు.

అయితే 1935 లో అంబేద్కర్ గారి భార్య రమాబాయి గారు అనారోగ్యం కారణం గా మరణించారు. కొంతకాలనికి ఆయనకు బొంబాయి లో ప్రిన్సిపాల్, అలాగే జడ్జి గా చేయడానికి అవకాశం వచ్చినా, వాటిని వద్దనుకొని రాజకీయాలలోకి వచ్చారు. అలా Independent Labour Party, Scheduled Castes Federation అనే పొలిటికల్ పార్టీ లను కూడా స్థాపించారు.

అయితే సంపద కోసమో, అధికారం కోసమో పోరాటం చేయలేదు అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన పోరాడేవారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్దాంతంతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, కులమాత బేధాలు లేని సమాజం కోసం కృషి చేసేవారు.

అయితే స్వాతంత్రం వచ్చిన తరువాత అంబేడ్కర్ గారికి కేంద్ర మండలిలో మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రి గా పదవి వచ్చింది. అంతేకాదు భారత దేశపు రాజ్యాంగాన్ని రాసే అవకాశం అంబేద్కర్ గారికి దక్కింది. అలా Drafting Committee of the Constitution of India కి చైర్మన్ గా అపాయింట్ అయ్యారు.

రాజ్యాంగం రాయడం అంటే మాటలు కాదు కదా. ఒక దేశ తలరాతని రాయడమే. ఆయనలో ఎంత ప్రతిభ లేకపోతే ఆ అవకాశం వస్తుంది. అయితే రాజ్యాంగం రచించడానికి నియమించిన సభ్యులలో ఒకరు రాజీనామా చేయడం, మరొకరు మరణించడం, కొంతమంది అమెరికాలో ఉండిపోవడం, మరికొంతమంది రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులవడం ఇలా రకరకాల కారణాల వలన భారత రాజ్యాంగం రచించే బాధ్యతంతా అంబేద్కర్ గారి మీద పడింది. దాంతో ఆయన రాత్రి పగలు అని లేకుండా నిరంతరం రాజ్యాంగ రచనలోని ఉండేవారు. దానివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బ తింది. ఆయన్ని హాస్పిటల్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ సమయంలో ఆయనను చూసుకోవాటానికి డాక్టర్ శారదా కబీర్ (Sharada Kabir) అనే బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు. మెల్లగా ఆయన ఆరోగ్యం కుదుట పడిన తరువాత 1948 లో తన 56 వ ఏట అంబేద్కర్ గారు శారదా కబీర్ (Sharada Kabir) ని రెండవ వివాహం చేసుకున్నారు. తరువాత ఆవిడ సవితా అంబేద్కర్ (Savita Ambedkar) గా పేరు మార్చుకున్నారు. అలా కొద్ది రోజులకి 1948 లో రాజ్యాంగ రచన పూర్తి చేసారు.

వివిధ రకాల భాషలు, ఆచారాలు, మతాలూ ఉన్నటువంటి ఈ దేశంలో ఆయన ముందు చూపుతో రాసిన రాజ్యాంగం అనుసరించి ఇప్పుడు మన దేశం నడుస్తుంది అంటే ఆయన గొప్పతనం ఏంటో అర్ధం అవుతుంది. ఆయన కేవలం దళితుల కోసమో లేక వాళ్ళ రిజర్వేషన్ ల కోసమో మాత్రమే కృషి చేయలేదు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన జీతాలు ఉండాలని, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైం లో లీవ్స్ ఇవ్వాలని, పని గంటల సమయాన్ని 12 నుండి 8 గంటలు చేయాలనీ, స్త్రీలకూ ఆస్తి హక్కు ఇవ్వాలని ఇలా ఎన్నో అంశాలలో ఈయన కృషి చేసారు.

అయితే ఈయన జీవితం చివరి సమయంలో 1956 లో నాగపూర్ లో 5 లక్షల మంది తో కలిసి బౌద్ధ మతం స్వీకరించారు. ఆ తరువాత కొద్ది రోజులకి అనారోగ్యం కారణంగా 1956 డిసెంబర్ 6 వ తేదీన అంబేద్కర్ గారు మరణించారు.

ఆయన మరణించినగాని ఆయన కృషి ఇప్పటికీ ఎంతో మంది జీవితాలలో వెలుగుని నింపుతుంది. ఒకవేళ ఆయన పూనికుని ఉండకపోతే ఈనాటికి బడుగు బలహీన వర్గాల జీవితాలు ఇంకా అలాగే ఉండిపోయేవేమో.

అందుకే ఈయన చేసిన సేవలకు గాను 1990లో భారత ప్రభుత్వం భారత దేశపు అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న అవార్డు తో సత్కరించింది. కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ 100 scholars లిస్ట్ ని ప్రకటిస్తే దానిలో మొదటిపేరు అంబేద్కర్ గారిదే ఉంది. ఎందుకంటే BA , MA , MSc, DSC, Phd, LLD, dlit, Barister, ఇలా ఎన్నో డిగ్రీలను ఆయన సాధించారు. ఒక వ్యక్తి ఒక జీవిత కాలం లో ఇన్ని డిగ్రీలను పొందడం అంటే మాటలు కాదు.

ఈయన Hindi, Pali, Sanskrit, English, French, German, Marathi, Persian, and Gujarati ఇలా 9 భాషలు మాట్లాడగలరు. కేవలం ఈయన రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు. Philosopher, Anthropologist, Historian, Speaker, Writer, Economist, Scholar, Editor, ఇలా ఒకే వ్యక్తిలో ఎన్నో ప్రతిభలు, నైపుణ్యాలు ఉండేవి. అంతేకాదు కాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా అంబేద్కర్ గారే.

2012 లో The Greatest Indian ఎవరు అనే పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ గారే ఉన్నారు. దీనిని బట్టి ఆయన సమాజంలో ఎంత ప్రభావం తీసుకువచ్చారో అర్ధం చేసుకోవచ్చు.

ఒకప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవరూ పడకూడదు అనుకున్నారు. అందుకే తన జీవితాన్నంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి, వాళ్ళకి స్వేచ్చని అందించడానికి అంకితం చేసారు. కేవలం ఈయన వల్లనే అట్టడుగు వర్గాల వాళ్ళకి ఇప్పుడు అన్ని రంగాలలో సమానంగా అవకాశాలు అందుకున్నాయి.

అందుకే ఇప్పటికి ఎప్పటికి ఆయన చాలా మంది దేవుడితో సమానం. ముట్టుకోవడానికి కూడా వీలు లేని స్థాయి నుండి ఒక దేశ రాజ్యాంగం రాసే వరకు వెళ్లడంలో ఉన్న ఆయన ధైర్యాన్ని, పట్టుదలని మనం అందరం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి.




స్వామి వివేకానంద జీవితచరిత్ర - Swami Vivekananda Biography Telugu

Ratan Tata Biography in Telugu – రతన్ టాటా జీవిత చరిత్ర



Please Share With Your Friends : )

ads
+