ratan-tata-telugu

8 Most Important Skills You Need to Succeed in Career and Life

మీరు ఉద్యోగం చేస్తున్నా గాని లేదా వ్యాపారమైనా గాని ఆయా రంగాలలో గొప్ప స్థానాలకు వెళ్లాలనుకుంటే మనలో ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ (Skills) ఉండాలి. వేగంగా దూసుకుపోతున్న ఈ సాంకేతిక యుగంలో మీరు కూడా అదే వేగంతో ప్రయాణించాలి, లేదంటే వెనకపడిపోతారు. కాబట్టి మీరు ఉన్న రంగంలో మీరు దూసుకుపోవాలంటే ఉండవలసిన కొన్ని ముఖ్యమైన నైపుణ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. బాధ్యత వహించడం:

మనలో చాలామందికి ఏదైనా ఒక పని చేసే అవకాశం దక్కినప్పుడు...మనకెందుకులే, మనం చేయగలమో లేదో, అన్ని ఇబ్బందులు పడడటం అవసరమా? అని ఆలోచిస్తూ పనిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా కాకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించడానికి ముందు మీరే ప్రయత్నించండి. దీనివల్ల మీ మీద మీకు, అలాగే ఇతరులకు కూడా నమ్మకం పెరుగుతుంది. ఉదాహరణకి మీ కాలేజీ లో గాని ఆఫీస్ లో గాని ఏదైనా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చెయ్యవలసి వచ్చినప్పుడు అలాంటి వాటిలో చురుగ్గా పాల్గొనండి. అటువంటి సమయంలోనే మీ శక్తి సామర్ధ్యాలు మీకు తెలుస్తాయి.

2. మార్పు చెందడం:

ఈ ప్రపంచంలో ఏది కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతీది మారుతూ ఉంటుంది. మనం కూడా వాటితో పాటు మారాలి లేదంటే వెనకబడిపోతాం. కనీసం మీరు ఉన్న రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వాటికి తగ్గట్టుగా మనం కూడా మారుతూ మనల్ని మనం అప్ డేట్ చేసుకోవాలి. అప్పుడే ఈ ప్రపంచంతో పాటుగా మనం ముందుకు సాగిపోగలం.

3. నెట్వర్కింగ్:

కొంతమంది ఇతరులతో చాలా సులువుగా మాటలు కలుపుతూ నలుగురిలో కలిసిపోతారు. కాని మరికొంతమంది మాత్రం సిగ్గు, మొహమాటంతో ఎవరితో మాట్లాడకుండా ఒక మూలాన కూర్చుని ఉంటారు. ఇలా ఉంటె మనం చాలా నష్టపోతాం. మనం ఏ రంగంలో ఉన్నా సరే మనకంటూ ఒక నెట్ వర్క్ ఉండాలి. ఆ నెట్ వర్క్ ని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మీ రంగంలో ఉన్నటువంటి కొత్తవాళ్లతో పరిచయం పెంచుకోవాలి. ఒక్కొక్కసారి చిన్న మాటతో ఏర్పడిన పరిచయాలే మన జీవితాలలో ఊహించని మార్పుని తీసుకువస్తాయి. అందుకే అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ కి, సెమినార్ల కి హాజరవుతూ ఉంటే కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళ ద్వారా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

4. శ్రద్దగా వినడం:

ఈ రోజుల్లో సగం తప్పులు సరిగ్గా వినకపోవడం వల్లనే జరిగితున్నాయి. ఒక లీడర్ కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలలో చెప్పేది పూర్తిగా, శ్రద్దగా వినడం కూడా ఒకటి. ఈ కాలం లో ప్రతి ఒక్కరు మాట్లాడాలని, తమ తెలివితేటలను బయట పట్టుకోవాలనే చూస్తున్నారు గాని ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. ఇతరులు చెప్పేదాన్ని శ్రద్దగా వినడం వల్లనే వాళ్ళ మాటలలోని భావాలను అర్ధం చేసుకోగలం. ఇతరులు మనతో మాట్లాడుతున్నప్పుడు అటుఇటు దిక్కులు చూడకుండా వాళ్ళ కళ్ళలోకి చూస్తూ వినాలి. అలాగే ముందు ఎదుటి వారు పూర్తిగా చెప్పిన తరువాత మనం మాట్లాడాలి. మధ్యలో వాళ్ళని ఆపకూడదు. అసలు ఇతరులు చెప్పేది వినడమే మన వాళ్లకు ఇచ్చే అసలైన గౌరవం. కాబట్టి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు శ్రద్దగా వినడం అలవాటు చేసుకోండి.

5. ఆత్మవిశ్వాసం:

ఆత్మవిశ్వాసం(Confidence) అంటే మన మీద మనకు నమ్మకం ఉండడం. అసలు ముందు మన మీద మనకు నమ్మకం లేకపోతె ఇతరులు మనల్ని ఎలా నమ్ముతారు? చాలమందిలో ఈ ఆత్మవిశ్వాసం తగ్గడానికి కారణం వాళ్ళు ఒకేసారి పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటారు. వాటిని చేరుకోలేక వాళ్ళ మీద వారే నమ్మకం కోల్పోతారు. నిరుత్సాహ పడిపోతారు. అలాకాకుండా లక్ష్యాలను చిన్నభాగాలుగా చేసుకుని ఒక్కొక్కటి సాదించుకుంటూ వెళ్తే, మనలో చెయ్యగలం అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

6. ఎమోషనల్ ఇంటలిజెన్స్:

మన రోజువారీ జీవితంలో మనం బాధ, ఆనందం, కోపం, దుఃఖం ఇలా ఎన్నో ఎమోషన్స్ కి గురవుతూ ఉంటాం. ఆ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనకి తెలుసుండాలి. అదే ఎమోషనల్ ఇంటలిజెన్స్ (Emotional Intelligence). మనలో చాలా మంది కోపం వచ్చినా, బాధ వచ్చినా అదుపు చేసుకోలేరు. ముందు వెనుక చూడకుండా ఇతరుల మీద అరుస్తూ ఉంటారు. దీనివల్ల ఇతరులకు మన మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కొంతమంది ఆఫీస్ లోని కోపాలను ఇంట్లో వాళ్ళ మీద , అలాగే ఇంట్లో కోపాలను ఆఫీస్ లో చూపిస్తూ ఉంటారు. దీనివల్ల రెండు చోట్ల సంబంధాలు దెబ్బతింటాయి.

మన భావోద్వేగాలు మన ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మన ప్రవర్తన ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ముందు మనం మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉండాలి. దానివల్ల ఇతరులతో మనకి సత్సబంధాలు పెరుగుతాయి.

7. సమయపాలన:

జీవితంలో పైకి ఎదగాలి అనుకున్నవారు సమయాన్ని ఎప్పుడు వృధా చెయ్యరు. సమయం విలువ ఏంటో వాళ్ళకి తెలుసు. అందరికి ఉండేది 24 గంటలే కానీ వాటిని ఎలా వాడుకున్నాం అనే దానిమీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. Time Management అంటే ఏ పని ముఖ్యమైనది, ఏ పని ముందు చెయ్యాలో తెలుసుకోవడమే. సమయపాలన లేకపోతె అది మన నిర్లక్షానికి అద్దం పడుతుంది. ఇతరులకు మన మీద చెడు అభిప్రాయం కలుగుతుంది. దాని వల్ల మనకు వచ్చే అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది.

అలాగే ఖాళీ సమయం దొరికినప్పుడు మన జీవితానికి ఉపయోగపడే పుస్తకాలు చదవడం, మన కెరీర్ కి ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోవడం వంటి వాటికి ఉపయోగించుకోండి.

8. నాయకత్వం:

మనలో ప్రతి ఒక్కరు నాయకుడిగా మారాలనుకుంటారు. కానీ అది అంత సులువు కాదు. లీడర్ గా ఉండడం అనేది కత్తి మీద సాము లాంటిది. నాయకుడు చెప్పిన భావాలతో ప్రతి ఒక్కరూ ఏకీభవించాలి లేదు, కొందరు వ్యతిరేకించేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరిని నొప్పించకుండా, ఒప్పించేలా చెయ్యడం అనేది గొప్ప నైపుణ్యం. లీడర్ అనేవాడు తన టీం ని కష్ట సమయంలో ముందు ఉండి నడిపించగలగాలి. తన క్రింద వాళ్ళతో ఎలా పనిచేయించాలో తెలిసుండాలి. అలాగని వాళ్ళ మీద పెత్తనం చెలాయించకూడదు. మీ క్రింద పనిచేసే వాళ్ళు మీ మీద భయంతో కాకుండా, మీ మీద గౌరవంతో పని చేసేలా ఉండగలగాలి. దీనికి చాల నైపుణ్యం కావాలి.

ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలోనే కాకుండా మన ఉద్యోగ లేదా వ్యాపార రంగంలో కూడా ఉపయోగపడేవే. ఈ స్కిల్స్(Skills) ఎంత ఎక్కువగా ఉంటె మీరు కెరీర్ లో అంతలా దూసుకుపోగలరు. కాబట్టి పైన చెప్పిన స్కిల్స్ ని అభివృద్ధి చేసుకొవడానికి కృషి చెయ్యండి.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+