ratan-tata-telugu

వేమన పద్యాలు - Vemana Padyalu in Telugu - Vemana Satakam

ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచి అతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేగాని మరియంట నేర్చునా !
విశ్వదాభి రామ వినురవేమ!

అర్ధం: ఇనుము విరిగినచో , ఎర్రగా కాల్చి మ‌ళ్లీ అతికేలా చేయ‌వ‌చ్చు. అదే మనసు విరిగిపోతే తిరిగి క‌ల‌ప‌టం అసాధ్యం. అందుకే ఎవ్వరి మ‌న‌సు నొప్పించకూడదు.


చెప్పులోనిరాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమా!

అర్ధం:
చెప్పులోని రాయి, కంటిలోను నలుసు, కాలిలో దిగిన ముల్లు, ఇంటిలోని గొడ‌వ‌ చాలా బాధిస్తాయ‌ని అర్థ‌ము.


ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ, వినుర వేమా

అర్ధం :
ఓ వేమా! ఉప్పు, కర్పూరం చూచుటకు ఒకే మాదిరి కనపడతాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి. చూడటానికి అందరూ మనుషులొక్కమాదిరి గా కనిపించినా, పుణ్య పురుషులు అంటే సత్పురుషులు వేరుగా ఉంటారు. వారిని గుర్తించగలగాలి. అదే విజ్ఞత.


ధనము కూడబెట్టి దానంబు చేయక
తానుదినక లెస్స దాచుకొనగ
తేనెటీగగూర్చి తెరువరికియ్యదా
విశ్వదాభి రామ వినురవేమ !

అర్ధం:
ఓ వేమా! ధనమును బాగా సంపాదించి , దానధర్మములు చేయక, తానూ తినక,దాచుకొనుట అన్నది ఎటువంటిదంటే, తేనెటీగ కష్టపడి సంపాదించిన తేనె దారినపోయే బాటసారుల పాల్జేసిన విధముగా నుండును.


తప్పులెన్ను వారు తండోపతండంబు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగారు
విశ్వదాభి రామ వినురవేమ

అర్ధం:
వేమా! ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులను ఎత్తి చూపేవారు కోకొల్లలు. జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. ఇత‌రుల్లో త‌ప్పులు ఎంచే ఈ మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు. తప్పులను చెయ్యటం మానవ సహజం .


తల్లి దండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా ?గిట్టవా?
విశ్వదాభి రామ వినురవేమ

అర్ధం:
తల్లిదండ్రులపైన దయతో ఉండాలి. వృద్ధాప్యంలో వారిని దయతో ప్రేమతో ఆదరించాలి. అలా చేయని కొడుకు ఉన్నా లేనట్టే. అలంటి వాడు పుట్టలోనే పుట్టి చచ్చే చెద పురుగులతో సమానం.


మేడి పండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు,
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభి రామ వినురవేమ!

అర్ధం:
మేడి పండు పైకి చక్కగా నిగ‌నిగలాడుతూ కనిపించినప్పటికీ దానిలో పురుగులుండే అవకాశం ఉంది. అలాగే పిరికి వాడు పైకి ధైర్యం ప్రదర్శించినప్పటికీ అతని మనసులో భయం ఉంటుంది.


వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును
చీడపురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ!

అర్ధం:
మహా వృక్షము కూడా వేరుకు పురుగుపడితే చచ్చిపోతుంది. చెట్టుకు చీడ పడితే ఆ చెట్టు నాశనమై పోతుంది. అలాగే చెడ్డవాడి వలన ఎంత మంచి వాడైనా చెడిపోతాడని అర్ధము. కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహం చెయ్యకూడదు.


చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో !
విశ్వదాభి రామ వినుర వేమా!

అర్ధం:
ఓ వేమా! మంచి మనసుతో చేసిన పుణ్యం కొంచెమైనను భగవంతుని దృష్టిలో విశేషమైనది. మర్రి విత్తనము చాలా చిన్నదైనా , అది పెరిగి , మహా వృక్షము కాదా?


అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన !
విశ్వదాభి రామ వినురవేమ!

అర్ధం:
ఓ వేమా! పాడగా పాడగా పాట మధురంగా నుండును. చేదుగా ఉండే వేప కూడా తినగా తినగా తీపిగా ఉందును. అట్లే ఈ భూమిపై ప్రయత్నంతో ఎటువంటి పనులనైనా సాధించగలం.


ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా ?
విశ్వదాభి రామ వినురవేమ!

అర్ధం:
మనసు నిర్మలముగా లేకుండా ఆచారములు, పూజ‌లు పాటించడంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థ‌మే. ఏ ప్రయోజనముండదు.


గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు !
విశ్వదాభి రామ వినురవేమ

అర్ధం:
ఓ వేమా! శ్రేష్టమైన ఆవు పాలు ఒక్క గరిటెడైనను విలువైనవే .గాడిద పాలు కుండనిండుగా ఉన్ననూ ఉపయోగము ఏమియు లేదుకదా! కావున భక్తి తో పెట్టిన భోజనము పట్టెడైనా తృప్తి నిచ్చును.



అనువు కానీ చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభి రామ వినురవేమ

అర్ధం:
స్థాన బలము లేని చోట గొప్పవారమని విర్ర‌వీగ రాదు .ఇతరులకంటే తక్కువగానుండుట తప్పు కాదు . అది నీచము కాదు. అదెట్లనగా, కొండ అద్దములో చిన్నదిగా కనిపించుట మామూలే అంతమాత్రమున కొండ చిన్నదవ్వదు కదా? కావున తక్కువ వారమని కించపరుచుకోరాదు .



ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపే కానీ తెలుపు కాదు
కొయ్యబొమ్మతెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభి రామ వినురవేమ !

అర్ధం:
ఎలుక తోలు తెచ్చి ఎంతకాలము ఉతికిననూ దాని నలుపు పోయి తెలుపు రాదు. అట్లే జీవం లేని చెక్కతో చేసిన బొమ్మను ఎంత కొట్టినా పలుకదు కదా?



అల్పజాతివానికి కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
జెప్పుతినెడి కుక్క చెరకు తీపెఱుగునా
విశ్వదాభి రామ వినురవేమ

అర్ధం:
అల్పబుద్ధి గల దుష్టునికి అధికారమిచ్చినచో మంచి వారిని తొల‌గించి తనవారిని నియమించును. చెప్పు తినే కుక్కకి చెరకు తీపి తెలియ‌దు క‌దా.



అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ! వినుర వేమ!

అర్ధం:
ఓ వేమా! నీచుడైన వాడు ఎప్పుడూ ఆడంబరములు, గొప్పలు చెప్పును. మంచివాడు నెమ్మదిగా శాంతస్వభావుడై మాట్లాడును అదెట్లనగా , విలువలో తక్కువైనా కంచు గట్టిగా మోగును ,కానీ విలువైన బంగారం మ్రోగదు కదా? కావున మంచివాడెప్పుడూ అణుకువతో ఉంటాడు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+